సాక్షి, న్యూఢిల్లీ : ‘హింస అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. రండి, మనమంతా కలిసి శాంతిప్రాతిపదికన ప్రతి సమస్యను పరిష్కరించుకునే కొత్త భారతవనిని ఆవిష్కరిద్దాం! ఏ సమస్య పరిష్కారానికైనా సంఘీభావం ముఖ్యం’ అని ప్రధాని నరేంద్ర మోదీ సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలనుద్దేశించి జనవరి 26వ తేదీన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఆయన మంత్రులు, ఆయన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీలేమో ఆయన మాటలకు, స్ఫూర్తికి పూర్తి భిన్నంగా హింసను ప్రోత్సహిస్తున్నారు.
‘షహీన్‌బాగ్‌లో ఎంతటి ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయో, అదే స్థాయిలో, అదే ఆగ్రహావేశాలతో ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ యంత్రంపైనున్న మీట నొక్కాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ వాసులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో శాంతి సందేశం వినిపించిన మరుసటి రోజే అమిత్ షా ఇలా మాట్లాడడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో గత డిసెంబర్ నెల నుంచి నిరంతరం ప్రజాందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. అదే రోజు, జనవరి 27వ తేదీన పార్టీ కార్యలను ఉద్ధేశించి మాట్లాడుతూ ‘దేశ్ కే గద్దారోం కో అని పిలుపునివ్వగా, గోలీ మారో సాలోం కో’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.